Tuesday, September 18, 2012

వినాయక చవితి శుభాకాంక్షలు.

వినాయక చవితి శుభాకాంక్షలు.



ఆత్మీయ బంధువులారా!
వినాయక చవితి శుభాకాంక్షలు.


ది: 19-9-2012. ఈ రోజు భాద్రపద శుద్ధ చవితి. వినాయక చవితి. ఆదౌ పూజ్యో గణాధిపః, అనటం వల్ల తలపెట్టిన పని నిర్విఘ్నంగా నెరవేరటం కోసం ప్రతి పనికీ ముందు గణపతి పూజ చేస్తాం. ఆయన వద్ద సిద్ది అనే శక్తి ఉంది. దానివలన మనకు కార్యసిద్ది జరుగుతుంది. అట్టి గణపతిని విశేషంగా పూజించే పర్వదినం వినాయక చవితి. ఈ రోజు గణపతిని ఆయనకి ఇష్టమైన 21 రకాల ఆకులతో విశేషించి గరికతో పూజ చేసి ఆయనకు ఇష్టమైన ఉండ్రాళ్ళు, పళ్ళు నివేదన చేయాలి. వ్రత కథ చదివి అక్షతలు శిరస్సున ధరించాలి. పూజలో వాడవలసిన 21 రకాల పత్రినే పద్దతిగా వాడాలి. సంతలో ఎవో కొన్ని పిచ్చి ఆకులు కట్టి అమ్ముతారు. అవన్నీ వేయటం తగదు. ఎమైనా లోపిస్తే వానికి బదులు ఉన్న రకాన్నే వాడటం లేదా అక్షతలను వేస్తూ ఫలానా దానికి ఫలానాది వేస్తున్నం అని చెప్పుకోవాలి. పత్రి 21 రకాలకు వాడుకలోని పేర్లు.....
1.మాచిపత్రి 2.వాకుడు 3.మారేడు 4.గరిక 5. ఉమ్మెత్త 6.రేగు 7. ఉత్తరేణి 8. తులసి 9.మామిడి 10.గన్నేరు 11.విష్నుక్రాంత 12.దానిమ్మ 13. దేవదారు 14.మరువం 15.వావిలి 16.సన్నజాజి 17.తీగె గరిక 18.జమ్మి 19.రావి 20.మద్ది 21.జిల్లేడు.


ఈ 21 పత్రులు అనేక రోగాలు పోగొట్టగల శక్తి కలవి. వీటిని నదులు, చెరువులందు కలుపుట వలన వర్షాకాలపు మురికి, కొత్త నీటి కాలుష్యాన్ని పోగొడతాయి. దూర్వారయుగ్మం అంటే  గరిక. వినాయకుడు ఎలుకను వాహనంగా చేసుకొని 'అనింద్యుడు ' అని పేరు పెట్టాడు. గడ్డి కూడా పూజార్హమే అని గరిక పూజ చేయించుకుంటున్నాడు. గుంజిళ్ళు తీయటం కూడా ఆయనకి ఇష్టమైన పని.

గణాధిపతి అనుగ్రహప్రాప్తిరస్తు. 




Thursday, August 9, 2012

కృష్ణాష్టమి

ది: 9/8/2012 కృష్ణాష్టమి 




ఆధ్యాత్మిక బంధువులారా! కృష్ణాష్టమి శుభాకాంక్షలు. నేడు (9/8/2012 ) శ్రావణ బహుళ అష్టమి. దీనినే 'కృష్ణాష్టమి ' అంటారు. ఈ రోజు శ్రీకృష్ణుని జననం జరిగింది. కావున 'కృష్ణ జయంతి ' అని, 'జన్మాష్టమి ' అని కూడా అంటారు.  తన లీలలు చూపటానికి గోకులం చేరింది కూడా ఈ రోజే కాన గోకులాష్టమి అని కూడా దీనిని అంటారు. శ్రీ కృష్ణునివన్నీ లీలలే. దొంగతనం చేసి కొందరు జైలుకు వెళ్తారు. కృష్ణుడు పుట్టటమే జైలులో పుట్టి జైలు నుండి వచ్చి దొంగతనాలు చేశాడు. నిజానికవి దొంగతనాలు కావు. వాటి అన్నిటా పరమార్ధం ఉంది. రామావతారంలో తన కౌగిలి కోరిన మునులంతా ఈ అవతారంలో గోపికలుగా పుట్టగ వారికి రాస లీల పేర కౌగిలి నందించి వారిని ధన్యులను చేశాడు. అది లీల తప్ప అందు విమర్శించవలసినది లేదు. ఎందుకనగా అప్పతికి ఆయనది పౌగండ వయస్సు(5-6 ఏండ్లు). ఇంకా చదువుకే వెల్లలేదు.
           భూభారం తగ్గించటానికి పుట్టిన ఆయన రాజుల రూపంలో ఉన్న రాక్షసులను తానే వెదకి చంపే పని పెట్టుకోక జరాసంధుని ద్వారా అందరినీ తన ముందుకు రప్పించుకొని సంహరించాదు. లోకం కోసం భగవద్గీతను బోధించి జగద్గురువు అయ్యాడు. 'శ్రీకృష్ణ పరమాత్మా అని పరమాత్మ వాచకంతో ఆయననే కొలుస్తాం. దీనిని బట్టే ఆయన స్ఠానం గ్రహించాలి. ఆయన చేసినవన్నీ అధర్మాలుగా కనిపించే ధర్మ సూక్ష్మాలు.
            ఈనాడు క్రిష్ణాష్టమీ వ్రతం చేయాలి. ఉపవాసం, పూజ, జాగరణలు నిర్వహించాలి. అదంతా సాధ్యం కాని వారు కనీసం శ్రీ క్రిష్ణుని ప్రతిమ లేదా పటానికి షోడశోపచార పూజ చేసి క్రిష్ణునికి ఇష్టమైన పాలు, పెరుగు, వెన్న, మీగడ లు నివేదించాలి. దొరికితే పొన్న పూలు తెచ్చి పూజ చేయాలి. ప్రసవం రోజులలో తయారు చేసే కట్టెకారం క్రిష్ణుని ప్రసవించిన ఈ రోజున ప్రసాదంగా స్వీకరించడం ఉంది. శ్రీ క్రిష్ణుని లీలకు చిహ్నంగా ఉట్టి కొట్టడం వంటి వేడుకలు నిర్వహిస్తారు.

శ్రీ క్రిష్ణ శరణం మమ.
శుభం భూయాత్.