Thursday, December 1, 2011

గోమాత విశిష్టత 9 – గోహత్యా నిషేధోద్యమం

గోమాత విశిష్టత 9 – గోహత్యా నిషేధోద్యమం


గోమాత విశిష్టత – గోహత్యా నిషేధోద్యమం
Indian Cow
ఎంతో విశిష్టత, ఎన్నో ప్రయోజనాలు కల్గినగోవు నేడు మన అజ్ఞానకారణంగా ఎంతో ప్రమాదంలో పడింది. ‘మృత్యుగృహ ద్వారంవద్ద గోవు నిలబడి ఉంది. దాన్ని రక్షించగలమో లేదో కానీ గోవుతోబాటు మనము, మన సభ్యత నష్టపోవటం మటుకు ఖాయం అన్నారు గాంధీజీ. నిజంగానే మనం గోవును రక్షించలేకపోతూ అన్నివిధాలా నష్టపోతున్నాం. ఈస్టిండియాకంపెనీ వారు హిందూరాజులతోది సంధిపత్రాలలో ‘గోవధ చేయము’ అనే షరతు స్పష్టంగా వ్రాశారు. కానీ గోవధ ప్రారంభించటంతో 1857 ప్రధమ స్వాతంత్ర్యసంగ్రామం తరువాత బ్రిటీష్ ప్రభుత్వం ‘భారతదేశాన్ని స్థిరంగా నిలబెడుతున్న విశేషా లేమిటో తెలిసికొని వాటికి విరుగుడు సూచించా’లని ఒక కమిటీని వేసింది. అది తన రిపోర్టులో 1. ధార్మికత్వం, 2. సమాజంలోని పంచాయతీ వ్యవస్థ 3. గోవు కేంద్రంగా ఉన్న వ్యవస్థ అని మూడు కారణాలు తేల్చింది.
అప్పటినుండి ఆ మూడు వ్యవస్థలను నాశనం చేయడానికి క్రిష్టియన్ మిషనరీ ఆధునిక విద్యా విధానం, సొసైటీ రిజిస్ట్రేషను చట్టం, యంత్రాలు ప్రవేశపెట్టడంద్వారా వాని నిర్మూలన యత్నం చేసింది. 1917 సంవత్సరంలో బ్రిటీష్ ప్రభుత్వం గోవధకు ఆంక్షలు సడలించటంతో మన గోసంపద క్షీణించడం ప్రారంభమైంది. 1921వ సంవత్సరంలోనే ఢిల్లీలో గాంధీజీ అధ్యక్షతన జరిగిన గోపాష్టమి తీర్మానంలో గోవధపై ఆంగ్లేయ ప్రభుత్వం చట్టపరమైన నిషేధం విధించకపోతే దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణోద్యమం చేపట్ట గలమని హెచ్చరించారు. ఆ తీర్మానంపై హకీమ్ అజీమల్ ఖాన్, డా. అన్సారీ, పండిత మోతీలాల్, లాలా లజపతిరాయ్, మదనమోహన మాలవ్యా మొదలైన కాంగ్రెసునాయకులు సంతకాలు చేశారు. అప్పటినుండి కాంగ్రెసుసభలతో బాటు గోరక్షాసమ్మేళనమూ నిర్వహించడం మొదలైంది. ముస్లిముల పరిపాలనాకాలంలో కూడా హిందూ సహయోగంకోసం గోహత్యను నిషేధించారు.


హుమయూన్ తండ్రియైన బాబరుమాటపై 1586 లోనే గోవధ నిషేధించి గోవధ చేస్తే వ్రేళ్ళు నరికివేసే ఫర్మానా జారీ చేశాడు. కాశ్మీరులోకూడా గోహత్యా నిషేధం అమలు చేయబడింది. ఆంగ్లేయులకు, అంతకంటే ఎక్కువగా ఆంగ్లేయ మానస పుత్రులకు మాత్రం గోహత్య దోషమనిపించటంలేదు. విదేశీపరిపాలనకంటే విదేశీ భావాలకు అమ్ముడుపోయిన స్వదేశీయుల పాలనలోనే గోహత్య దారుణంగా పెరిగిపోవటం విచారకరం. ఆంగ్లేయుల ధోరణి ప్రమాదకరంగా కన్పడటంతో 1941 లోనే గోసేవాసంఘ్ స్థాపింపబడింది. అనేక కోణాలలో గోసంతతి వృధ్దికి కృషి జరిగింది. ‘స్వాతంత్ర్యం పొందిన మరుక్షణం ఒక్క కలంపోటుతో గోవధను నిషేధిస్తాం’ అన్నారు లోకమాన్యతిలక్. ‘స్వతంత్ర భారతంలో ప్రభుత్వం యొక్క ప్రధమ చర్య గోసంరక్షణ’ అన్నారు మదనమోహన మాలవ్యా. ‘స్వాతంత్ర్య సంపాదన ఎంత ప్రియమో గోరక్షణ అంత ప్రియ’మన్నారు గాంధీజీ. పదవులనాశించని మహనీయుల మాటలు పదవుల నలంకరించిన వారికి అనుసరణీయాలు కాలేదు. ప్రధమ స్వాతంత్ర్య దినోత్సవంలో గోహత్యను నిషేధిస్తూ మొట్టమొదటి ప్రకటన చేయాలని లాలా హరదేవసహాయ్, సద్గురు ప్రతాపసింగ్ నామ్ ధారీ, నిధాన్ సింగ్ ఆలమ్ ల నాయకత్వంలో ప్రతినిధి బృందం శ్రీ జవహర్ లాల్ నెహ్రూను కలిసి చెప్పింది. ఆయన నిపుణుల కమిటీవేసి వారి నివేదికను పూర్తిగా అమలుచేస్తామని చెప్పారు. 17-11-1947న కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని వేయగా అది 6-11-1948న తమ నివేదిక సమర్పిస్తూ ఎప్పటివరకూ పూర్తిగా గోవధ నిషేధింపబడదో అప్పటి వరకూ దేశ ప్రజలకు స్వాతంత్ర్యం పొందిన ఆనందం ఉండదని తెలియజేసింది. గోసంరక్షణ ప్రాధమికహక్కు కావలని ప్రజలనుండి 60వేల టెలిగ్రాములు, లక్ష లేఖలు వెళ్ళాయి. ఉత్తరాలు లెక్కించలేక తూకం తూచింది ప్రభుత్వం. గోహత్యానిషేధం మాత్రం చేయలేదు. రాజ్యాంగం 48వ అధికరణంలో ‘ఆవు, దూడ, దున్నేవి, పాలిచ్చేవి, బరువులు లాగేవి అయిన పశువులను చంపడాన్ని నిషేధించడం ప్రభుత్వ విధాన’ మని మాత్రమే ప్రకటించింది. దాని ఉద్దేశ్యం గోవధను నిషేధించటంకాదని, ఉపయోగకరమైన పశువులను వధించటాన్ని నిషేధించడం మాత్రమేనని 20-12-1950న కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ రాష్ట్రప్రభుత్వాలకు లేఖ వ్రాసింది. (ఇంకా ఉంది)


1 comment:

  1. చిదంబర శాస్త్రి గారూ మీరు చాలా చక్కగా వ్రాస్తున్నారండీ! ఎంతో విలువయిన సమాచారాన్ని పొందుపరుస్తున్నారు!

    ReplyDelete