Tuesday, April 12, 2011

గోమాత విశిష్టత – 2

పంజాబ్ విశ్వవిద్యాలయం వారొక ప్రయోగం చేశారు. కొన్ని ఆవులు, కొన్ని గేదెలకు లెక్కప్రకారం కొంత మేతలో DDT కల్పి తినిపించారు. కొద్దిరోజుల తరువాత ఆ అవుల పాలలో 5% మాత్రమే DDT అంశాలుండగా ఆ గేదెల పాలలో 12% DDT ఉంది. DDT కల్పిన నీటితో గేదెల్ని కడిగినా వాటి పాలలో DDT అంశం ఉన్నట్లు తేలింది. ఆవులందు అలాకానరాలేదు. ఆవుపేడ, మూత్రములందున్న ఔషధగుణాలు, దివ్యశక్తి గేదెపేడ, మూత్రము లందు లేవు. ఆవుపేడవేసిన పైర్లకు పురుగు రాదు. పండే ధాన్యము పుష్టికరంగా ఉంటుంది. గేదెపేడతో పురుగు వ్యాపిస్తుంది. రసాయనాలవల్ల మరీ ఎక్కువగా పురుగు వ్యాపించే ప్రమాదముంది. అలా పండే పంటవలనా అనేక అనర్థాలున్నాయి. అవన్నీ నేడు మనం అనుభవిస్తున్నాం. ‘ఆరోగ్యం భాస్కరా దిచ్ఛేత్’ అని ఆరోగ్య శక్తి సూర్యునివలన లభిస్తుంది. గోవు వెన్నుపై సూర్యనాడి ఉంది. దానిద్వారా గోవు సూర్యకిరణములందలి సౌరశక్తిని ఆకర్షిస్తుంది. ఆ కారణంగా గోవు సంబంధ మైనవన్నీ పవిత్రములు, అరోగ్యప్రదములు అవుతున్నాయి. శ్రీకృష్ణపరమాత్మ 1) గోవు, 2) భగవద్గీత అనే రెండు పవిత్రవస్తువులను సమాజం ముందుంచాడు. గోవు, గురువు, గంగ, గాయత్రి, గోవిందుడు, గీతలను గకారషట్కం అంటారు. అందు గోవు ప్రధమస్థానీయం. ‘గవార్థే భూపతి స్సద్యః ప్రాణానపి పరిత్యజేత్’ అని గోవు కోసం రాజు ప్రాణత్యాగమైనా చేయవలనెనని చెప్పబడగా నేటి పాలకులు గోవుప్రాణాలనే హరిస్తున్నారు. ‘గో భూ తిల హిర ణ్యాజ్య – వాసో ధాన్య గుడాని చ, రౌప్యం లవణ మిత్యాహుః – దశదనాః ప్రకీర్తితాః’ అని దశదానాలలో తొలిదానం గోదానమే. ‘గోదానేన సమం దానం నాస్తి నాస్త్యేవ భూతలే’ అని గోదాన సమంలేదని చెప్పబడింది. ‘భూప్రదక్షిణ షట్కేన – కాశీయాత్రా యుతేన చ, సేతుస్నాన శతై ర్యచ్చ – తత్ఫలం గోప్రదక్షిణే’ అని గో ప్రదక్షిణం చేయుటవల్ల ఆరుసార్లు భూప్రదక్షిణం చేసిన ఫలం, పదివేలసార్ల కాశీయాత్ర, వందసార్లు సేతు స్నానము చేసిన ఫలితం చేకూరుతుంది. ‘గోభి ర్న తుల్యం ధన మస్తి కించిత్’ అని గోవుతో సమానమైన ధనంలేదు.
భారతదేశం గోజాతి సమృద్ధిగా ఉన్ననాడు స్వర్ణయుగాన్ని అనుభవించింది. అందుకే భారతదేశాన్ని గోవ్రత దేశంగా పిలిచేవారు. భారతదేశంలో కూడా తెలుగువారికి గోరక్షణ మరీముఖ్యమైనది. ఎందుకంటే మనకు ‘తెలుగు’వారను పేరు రావడానికి కారణం గోవే అని భాషాశాస్త్రం చెప్తోంది. ‘సరసా స్తిలవ ద్గావో – యత్రసన్తి సహస్రశః సదేశ స్తిలగుర్నామ’ అనేది అందుకు ప్రమాణవాక్యంగా చూపుతోంది. తిలలు అంటే నువ్వులు. నల్లని నూవులవలె నల్లగా ఉండే గోవులు శ్రేష్టములంటారు. ‘గోవుల లోపల కపిల బహు క్షీర’ అని చిన్నయసూరి బాలవ్యాకరణంలో వ్రాశాడు. తిలలవంటి గోవులు వేలాదిగా ఉన్న ఈ ప్రదేశం పూర్వం ‘తిలగు’ అని పిలువబడేదని, ఆ ‘తిలగు’ శబ్దంనుండే ‘తెలుగు’ శబ్దం వచ్చిందని భాషాశాస్త్రం వివరిస్తోంది. అలా మనం నిజమైన తెలుగువారం కావాలంటే గోవులను ఆంధ్రదేశమంతటా పోషించి వృధ్దిచేయాలి. ఈ గోవు హిందువులకు ఆరాధ్యదేవత. హిందూసాహిత్యం శ్రుతి స్మృతి పురాణాదిక మంతా గోవును పలువిధాల ప్రశంసిస్తోంది.

Read the rest of this entry »
Written by Dr. Annadanam Chidambara Sastry

No comments:

Post a Comment