Tuesday, April 26, 2011

గోమాత విశిష్టత – 3
ఇలాగే యజుర్వేదం (23-48) లో ‘బ్రహ్మా సూర్యసమం జ్యోతిః’ మంత్రంలో ‘గోస్తు మాత్రా న విద్యతే’ అని గోవునకు సమమైనది లేదని తెలుపబడింది. ‘గాం సీమాహిం రదితం విరాజమ్’ అని గోహింసను నిషేధిస్తోంది. ‘అంతకాయ గోఘాతమ్’ అని గోహంతకులను హతమార్చ మనికూడా యజుర్వేదం చెప్పింది. గోవధ అంతటి పాపమని గ్రహించాలి. అంతేకాదు ‘క్షుధేయాగాం విక్రేతం తం భిక్షమాణ ఉదితిష్టాశినమ్’ ని వేదం గోహంతకుడు భిక్షకై వచ్చినా భిక్ష పెట్టవద్దని, వానికి మరణమే శిక్ష ని చెప్తోంది. అధర్వణ వేదంకూడా గోవునందు సకలదేవత లున్నవిషయం చెప్పింది. ‘ఏకో గౌ రేక’ (8-9-26) లో గోవు పరోపకారులందు మొదటిదిగా చెప్పబడింది. ‘చతుర్నమో’ (11-2-9) మంత్రంతో గొప్పదగు గోవును సృజించిన భగవంతునకు వందనము సమర్పింబడింది. 12-4-5 లో గోవు పవిత్రజంతువని, పూజింపదగినదని చెప్పబడింది. అధర్వణ వేదం ‘పచతేవశాన్’ (1-114-10) మంత్రంలో గోమాంసమును ఇంటియందుకానీ మరెచ్చటకానీ వండువాడు, తినువాడు భ్రష్టుడు కాగలడని చెప్పటమేకాక గోవులందు, క్రౌర్యం చూపవద్దని, కత్తివంటి మారణాయుధాలను గోవుకు దూరంగా ఉంచమని చెప్పింది. ఇంత స్పష్టంగా చెప్తున్నా పవిత్రగోవునుగూర్చి కువ్యాఖ్యలు చేయబడి భ్రాంతికారణాలుగా కొన్ని తయారయాయి. గోమాంస భక్షణం వెనుకటి మునులు చేశారని, వేదపురాణాలలో అటువంటి ప్రసంగాలున్నాయని అంటారు. గౌ శబ్దాన్ని తప్పుగా వ్యాఖ్యానించుకొని చేసే విమర్శ అది. గౌ శబ్దానికి ఇంద్రియములనికూడా అని అర్థం. నేను గోవును తింటాను అంటే జితేంద్రియుడ నౌతాను అని యాజ్ఞవల్క్యుడు చెప్పాడు. దురదృష్టవశాత్తు దాన్ని అర్థం చేసికొనక గోహత్యను సమర్థించేవారు దాన్ని వాడుకొంటున్నారు. గోశబ్దానికి ఆవు, ఎద్దు, సూర్యుడు, యజ్ఞం, వాక్కు, దిక్కు, భూమి, గుర్రం, స్వర్గం, ఉదకం, వెంట్రుక, బాణం, వజ్రం, ముని, నేత్రం, పగ్గం, అల్లెత్రాడు వంటి ఎన్నో అర్థాలు తెల్లనిఘంటువుల లోనే ఉన్నాయి. ఇంకా నిరుక్తపరంగా ఎన్ని అర్థాలున్నాయో అవన్నీ ఆలోచించకుండా ఆవుగానే భావించి అపార్థాలు రానీయరాదు. అపార్థాలతో కావ్యాలలో కూడా తద్దినాలకు దూడమాంసాలు పెట్టినట్లు, గోమాంసాలు పెట్టినట్లు వ్రాశారనే విమర్శలున్నాయి. అవన్నీ వేదమంత్రాల అపార్థాలతో వచ్చిన ప్రమాదాలే. సంప్రదాయాన్ని నాశనం చేయటానికి ఇరికించబడిన కృత్రిమ వాక్యాలను, అపార్థాలను, కవుల అతిశయోక్తుల విపరీతధోరణులను ప్రక్కన పెట్టకపోతే మన ధర్మాలన్నీ ప్రమాదంలో పడతాయి. వేదము లన్నిటియందే కాక తత్సంబంధమైన కఠ, మైత్రాయణీయ, తాండ్య, జైమినీయ, శతపధాది బ్రాహ్మణ గ్రంధాలలో గోశబ్దంయొక్క నానార్థ రహస్యాలు చెప్పబడినాయి.Read the rest of this entry »

by Dr Annadanam Chidambara Sastry

No comments:

Post a Comment