Tuesday, June 7, 2011

గోమాత విశిష్టత 5 – గోవులు ప్రపంచజనులందరకూ తల్లులు

గోమాత విశిష్టత 5 – గోవులు ప్రపంచజనులందరకూ తల్లులు


గోవు వలన ప్రయోజనాలుః ఆవు మనకు అనేక విధాల ప్రయోజనకారి.ఆవుపాలుః పసిపిల్లలకు తల్లిపాలు అమృతసమాలు. తల్లిపాల తరువాత వారికి శ్రేష్టమైనవి ఆవుపాలే. తల్లిపాలు కొరవడిన పిల్లలకు ఆవుపాలు పట్టటమే సర్వవిధాల శ్రేయస్కరం. పసితనం దాటినా అట్టి తల్లిపాల అమృతఫలాన్ని అన్ని విధాలా పొందగల్గుటకు మార్గం గోమాతపాలు త్రాగటమే. కాబట్టే ‘గావః విశ్వస్య మాతరః’ గోవులు ప్రపంచజను లందరకూ తల్లులు అని వేదం చెప్పింది. ‘దేని లాభాలు లెక్కించలేమో అది గోవు’ అని యజుర్వేదం చెప్పింది. తల్లిపాలలోని గుణాలు, ఇంకా విశిష్టగుణాలుకూడా ఆవుపాలలో ఉన్నాయి. అందుకే పిల్ల, పెద్దలందరకూ అవి స్వీకరింపదగినవి. ఆవుపాలు సమశీతోష్ణంగా ఉంటాయి. మధురంగా ఉంటాయి. వీర్యపుష్టి, బలము, జఠరదీప్తి, దీర్హాయువు, బుద్దిబలం చేకూరుస్తాయి. జీర్ణజ్వరం తొలగిస్తాయి. స్త్రీల పిండోత్పత్తిస్థానానికి బలం చేకూరుస్తాయి. బాలింతలకు పాలుబడచేస్తాయి. అనేకవ్యాధులను ఆవుపాలు నయంచేస్తాయి. ఆవుయొక్క రంగును బట్టి ఈతలను బట్టి మేతలను బట్టి ఆవుపాలు ప్రత్యేక గుణాలు కలిగి ఉంటాయని వైద్యశాస్త్రం చెప్తోంది. నల్లఆవుపాలు పైత్యహరం. ఎరుపు ఆవుపాలు కఫహరం. చారలఆవులు వాతపైత్య హరం, త్రిదోష హరం, కపిలవర్ణపు ఆవుపాలు వీర్యపుష్టిని, కండ్లకు చలువను కలిగిస్తాయి. తెలకపిండిమేసిన ఆవుపాలు గురుత్వం, కఫం కలిగిస్తాయి. ప్రత్తిగింజలుమేసిన ఆవుపాలు అపథ్యం. పచ్చగడ్డిమేసిన ఆవుపాలు, ఎండు గడ్డిమేసిన ఆవుపాలు త్రిదోషహరం. తొలిఈత ఆవుపాలు బలము కలిగించి పైత్యం పోగొడతాయి. రెండవ ఈతవి వాతహరం, మూడవఈతవి శ్లేష్మవాతహరంకాగా, నాల్గవ ఈత ఆ పై ఈతల ఆవుపాలు త్రిదోషహరం. సాధారణంగా ఆవుపాలలో వైరస్ ను తొలగించే శక్తి ఉంది. ఆవుపాలు విరేచనం సాఫీగా అవటంలోనూ, కంటిచూపును అభివృధ్ది చేయడంలోనూ తోడ్పడతాయి. ఇవి వాజీకరం. ఆవుపాలను ఎప్పుడూ వాడుతూఉంటే వార్ధక్య బాధ సమీపించదు. ధారోష్ణధుగ్ధం అంటే పొదుగు నుండి వస్తూనే వేడిగా నుండే పాలు అమృతతుల్యం. ఏమాత్రం ఆలస్యమైనా పచ్చిపాలదోషం దానికి పడుతుంది. ఆవుపాలలో ఆధ్యాత్మికశక్తినికూడా పెంపొందించే గుణముంది. అందు సరస్వతి ఉంది.


Read the rest of this entry »
by Dr Annadanam Chidambara Sastry
http://www.jayahanumanji.com/

No comments:

Post a Comment